టెన్త్ పరీక్షల్లో అంతర్గత మార్కులకు స్వస్తి! 23 d ago
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేసింది. ఈ సంవత్సరం నుండి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అంతర్గత పరీక్షలకు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25) నుండి అంతర్గత పరీక్షలకు కేటాయిస్తున్న మార్కుల విధానాన్ని ఎత్తివేసి, ఇంటర్ తరహాలోనే మార్కులు ఇవ్వనున్నారు. ఇకపై ఆరు సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయి.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.50 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆర్నెల్ల తర్వాత, మూడున్నర నెలల ముందు పరీక్షల విధానం మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విద్యాహక్కు చట్ట ప్రకారం దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్ధులకు నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ) అమలవుతోంది. రాష్ట్రంలో దీనిని 2011 నుంచి అమలు చేస్తున్నారు. దీని ప్రకారం అంతర్గత పరీక్షలకు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్ధులకు 20కి 20 మార్కులు వేస్తుండగా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఈ విధానం ప్రకారం అంతర్గత పరీక్షలకు మార్కులుండవు. ఒక్కో సబ్జెక్టుకు పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. సైన్స్‌లో భౌతిక, జీవశాస్త్రాలున్నందున ఒక్కో దానికి 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు.